TSPSC పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బండి సంజయ్.. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం నిరసన దీక్ష ప్రారంభించారు.
మరోవైపు గన్‌పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు. బండి సంజయ్ దీక్షకు అనుమతిలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. బండి సంజయ్ కలగజేసుకుని పోలీసులతో మాట్లాడారు. సంజయ్‌తో చర్చించిన అనంతరం పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మరికాసేపట్లో నిరసన దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాల్గొననున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఎస్పీఎస్సీ లీకేజీ అంశంపై విపక్షాల ఆందోళనలు చేస్తున్నాయి. గన్‌పార్క్ బండి సంజయ్ దీక్ష చేస్తుండగా.. తన నివాసంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిరాహార దీక్ష చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన షర్మిల హౌస్ అరెస్టు అయ్యారు. ఇంకోవైపు గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.