తెలుగు సంవత్సరం ఉగాది గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు.. ఈరోజు అంటే చాలామందికి ఇష్టం.. ఆరు రుచులు కలిసిన పచ్చడి కళ్ళముందు కదులుతుంది.పంచాంగం.. భవిష్యత్ ఏ రాశివారికి బాగుంటుంది అనే విషయాలు వినిపిస్తాయి.ఉగాది గురించి ప్రతి ఒక్కరు చెబుతారు.. కానీ ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది.. ఏం చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు. ప్రతి పండుగలానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెబుతారు. నువ్వులనూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలిరోజైన ఉగాదినాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా , ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి నమ్మకం..
తలస్నానం చేసి,గడపకు పసుపు , కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాదిరోజున ఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఓ సందేహమే..ఉగాది రోజున కాలమే దైవం. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి. స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించినా ,శివుడు, అమ్మవారికి ప్రకృతి ప్రసాదాలకు పూజలు చెయ్యడం మంచిది..కొత్త సంవత్సరం కోపాలు అలకలు తగ్గించండి మంచిది..