దిల్లీలో గెలవాలనుకుంటే ముందు నగర ప్రజల మనసు గెలుచుకోవాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే ఆయనకు నేను చెప్పే మంత్రం అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా కేంద్రం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. కేవలం దురుద్దేశంతోనే ఇటువంటి చర్యలకు దిగిందన్న ఆయన.. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను అడ్డుకోలేదన్నారు.
బడ్జెట్‌ను అర్థం చేసుకోలేని కొందరు నిరక్షరాస్యులకు చూపించే బదులు అర్థం చేసుకునే వారికి ఇస్తే బాగుండేదంటూ బీజేపీ నేతలపై కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏదేమైనా.. కేంద్రంతో తమకు ఎటువంటి వైరం లేదని.. ప్రధాని తమకు మద్దతు ఇస్తే అదే విధమైన మద్దతు తమనుంచి వారికి లభిస్తుందని స్పష్టం చేశారు.
‘నేడు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ, కేంద్రం దాన్ని అడ్డుకుంది. ఎటువంటి మార్పులు చేయకుండానే కేంద్ర హోంశాఖకు బదులిచ్చాం. అనంతరం వాళ్లు దానికి ఆమోదం తెలిపారు. వాళ్లముందు నేను తలొగ్గాలని వారి కోరిక. ఇది కేవలం వారి అహం మాత్రమే. అంతకన్నా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. జగడం వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం ఉండదు. ’ అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.