అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే భూకంపం ధాటికి పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో తొమ్మది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు వెల్లడించారు. వందకు పైగా మంది గాయపడ్డారని చెప్పారు.
మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో హిందూకుష్ పర్వతాల్లో భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. దిల్లీ, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లో భూమి కంపించింది. దిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.