తరచూ అణుబాంబులు పేలుస్తామంటూ ప్రపంచ దేశాలను ఉత్తర కొరియా బెదిరింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ ఈ దేశం తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతుంటే కేవలం విన్నాం. అప్పుడప్పుడు క్షిపణి పరీక్షలు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తే చూశాం. కానీ ఎప్పుడూ ఉత్తర కొరియా అణ్వస్త్రాలను ప్రపంచం చూసింది లేదు. అయితే ఇన్నాళ్లు కేవలం వార్నింగులకే పరిమితమైన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈసారి స్వయంగా ఆ విధ్వంసకర అస్త్రాలను ప్రపంచానికి చూపించారు.
ఉత్తర కొరియాలోని అణ్వాయుధ సంస్థను సందర్శించిన కిమ్.. అక్కడున్న వివిధ రకాల అణు వార్‌హెడ్లను పరిశీలించారు. ఆ ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ విడుదల చేసింది. అక్కడ కొత్త రకం ట్యాక్టికల్ వార్‌హెడ్‌లు కూడా ఉన్నాయి. స్వల్పశ్రేణి క్షిపణులు సహా అనేక అస్త్రాల్లో అమర్చేలా ఈ చిన్నపాటి బాంబులను రూపొందించినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా లక్ష్యంగా రూపొందిన వీటికి హ్వాసన్-31 అని పేరు పెట్టినట్లు సమాచారం. యుద్ధనౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యమున్న భారీ టోర్పిడో కూడా అక్కడ కనిపించింది.