ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అధినేత అమృత్‌పాల్ సింగ్ గత పదిరోజులుగా పంజాబ్ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. రకరకాల వేషాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అమృత్ పాల్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ఖలీస్థానీ అనుకూలవాదీ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడట. సిక్కులకు పరమపవిత్రంగా భావించే శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ జథేదార్ జ్ఞాని హర్ప్రీత్ సింగ్తో సమావేశమైన అనంతరం అమృత్‌పాల్.. పోలీసులకు లొంగిపోనున్నాడని సమాచారం. లొంగిపోయే ముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అమృత్‌పాల్ ఆలోచించాడని పంజాబ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో అమృత్‌పాల్ తన మనసు మార్చుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు అమృత్పాల్ను ఇంకా అరెస్ట్ చేయలేదని పంజాబ్ ప్రభుత్వం.. పంజాబ్, హరియాణా హైకోర్టుకు తెలిపింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా అతడిని అదుపులోకి తీసుకోలేకపోయామని వెల్లడించింది.