భారతీయ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్షల్ లాంటి వారని కొనియాడారు మహారాష్ట్ర రైతులు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు అనుకూల పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు తెలంగాణలో ఎందుకు కలవాలని కోరుకుంటున్నాయో తెలుసుకునేందుకు ఆ ప్రాంతాల్లో పర్యటించినట్లు ప్రముఖ రైతు సంఘం షెట్కారీ సంఘటన్ నేతలు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలను మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు వివరించినట్లు తెలిపారు. ఆ పథకాలు నిజంగా అమలవుతున్నాయా అని తెలుసుకునేందుకు తెలంగాణలో కూడా పర్యటించామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో రైతు సంక్షేమ పథకాల గురించి అనేక మంచి విషయాలు తెలిశాయన్నారు. గతంలో మహారాష్ట్ర నేత శరద్ జోషి ఆకాంక్షించిన పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నట్లు షెట్కారీ సంఘటన్ నేతలు వెల్లడించారు. నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ తర్వాత కేసీఆర్ గురించి చర్చ జరుగుతోందని వివరించారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని రైతుసంఘం నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు