ప్రతి ఏటా సెప్టెంబర్ నెల వస్తుందంటే చాలు.. ఐఫోన్ ప్రియులు నూతన ఐఫోన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ సారి కూడా సెప్టెంబర్ నెల వచ్చేసింది. యాపిల్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది. అందులో భాగంగానే కొత్త ఐఫోన్లను కూడా యాపిల్ విడుదల చేసింది. మరి ఆ ఫోన్లు ఏమిటో, వాటిల్లో ఉన్న ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
యాపిల్ ఈసారి ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ , Xఆర్ ల పేరిట మూడు కొత్త ఐఫోన్లను విడుదల చేసింది. వీటిల్లో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను తొలిసారిగా అందిస్తున్నారు. ఈ ఫోన్లలో రెండో సిమ్ ఫిజికల్ సిమ్గా ఉండదు. ఇ-సిమ్గా ఉంటుంది. టెలికాం ఆపరేటర్లు సిమ్ ఇన్ఫర్మేషన్ను ఇ-సిమ్‌కు పుష్ చేస్తారు. దీంతో రెండో సిమ్‌ను వాడుకోవచ్చు. ఇక కేవలం చైనా మాత్రమే డ్యుయల్ సిమ్‌లో రెండో సిమ్ కూడా ఫిజకల్ వెర్షన్లో ఉంటుంది. మిగిలిన అన్ని దేశాల్లోనూ డ్యుయల్ సిమ్‌లో రెండో సిమ్ ఇ-సిమ్ రూపంలో ఉంటుంది.
ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ , Xఆర్ ఫోన్లలో ఫీచర్లన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. ఐఫోన్ Xఎస్ లో 5.8 ఇంచ్ ఓలెడ్ డిస్ ప్లేను, Xఎస్ మ్యాక్స్ లో 6.5 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. Xఆర్ ఫోన్లో 6.1 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేను అమర్చారు. మూడు ఫోన్లలోనూ ఐఫోన్ X తరహాలో డిస్ప్లే పైభాగంలో నాచ్ ఉంటుంది. ఇక మూడు ఫోన్లలోనూ యాపిల్ ఎ12 బయోనిక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది విడుదలైన ఐఫోన్ల కన్నా వేగవంతమైన ప్రదర్శనను ఈ ఫోన్లు ఇస్తాయి. ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లు 64, 256, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో, ఐఫోన్ Xఆర్ ఫోన్ 64, 128, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తున్నాయి. ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉంటే ఐఫోన్ Xఆర్ లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరా ఒక్కటే ఉంది. మూడు ఫోన్లలోనూ ముందు భాగంలో 7 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ ఐడీ ఫీచర్ లభిస్తోంది. ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేస్తే, ఐఫోన్ Xఆర్ లో ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేశారు.
మూడు కొత్త ఐఫోన్లలో మిగిలిన ఫీచర్లన్నీ ఒకే తరహాలో ఉన్నాయి. 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ, వైర్లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఈ మూడింటిలోనూ అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్లలో ఐఓఎస్ 12 లభిస్తుంది. దీన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తారు. ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ల ప్రారంభ ధరలు రూ.99,900, రూ.1,09,900 గా ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన భారత్‌లో ఈ ఫోన్లు విడుదలవుతాయి. అలాగే ఐఫోన్ Xఆర్ ఫోన్ అక్టోబర్ 26వ తేదీన లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.76,900 గా ఉంది.
ఇక యాపిల్ తన ఈవెంట్లో వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లను కూడా లాంచ్ చేసింది. జీపీఎస్, జీపీఎస్+సెల్యులార్ ఎడిషన్లలో ఈ వాచ్‌లు విడుదలయ్యాయి. ఇవి గతంలో వచ్చిన యాపిల్ వాచ్‌ల కన్నా పెద్దవిగా ఉండడంతో పాటు మరింత ఎక్కువ సౌండ్ అవుట్ పుట్‌ను ఇస్తాయి. కాగా నూతన సిరీస్ 4 వాచ్‌లలో ఈసీజీ చిప్‌ను కొత్తగా అమర్చారు. దీని వల్ల వాచ్‌లో ఉన్న ఈసీజీ యాప్ సహాయంతో యూజర్లు తమ ఈసీజీని ఎప్పుడైనా, ఎక్కడైనా రికార్డు చేయవచ్చు. అదంతా పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో సేవ్ అవుతుంది. అనంతరం దాన్ని వైద్యులకు చూపవచ్చు. ఈ వాచ్‌లలో ఉన్న ఈసీజీ ఫీచర్ వల్ల గుండె జబ్బులను ముందుగానే కనిపెట్టవచ్చని యాపిల్ చెబుతోంది. కాగా కొత్త వాచ్‌లు ఈ నెల 21వ తేదీ నుంచి పలు దేశాల్లో లభ్యం కానున్నాయి. కానీ భారత్‌లో ఈ వాచ్‌ల విడుదల తేదీలను యాపిల్ ఇంకా వెల్లడించలేదు. ఇక సిరీస్ 4 వాచ్లకు చెందిన జీపీఎస్ ఎడిషన్ ధర 399 డాలర్లు (దాదాపుగా రూ.28వేలు) ఉండగా, జీపీఎస్+సెల్యులార్ ఎడిషన్ ధర 499 డాలర్లు (దాదాపుగా రూ.35వేలు)గా ఉంది.