వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము ముందుకు వెళ్లడం లేదని వెల్లడించారు.
అయితే కేంద్రం ప్రకటనపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. “ఎన్నో ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ సిద్ధించింది. ఈ పరిశ్రమతో తెలుగువారి భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. విశాఖ ఉక్కు కేంద్రం ఆధీనంలోనే ఉండాలి. స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరారు” అని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.