హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ గురువుల ప్రార్ధనల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ మహా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండవ రాజధానిగా ఉండాలన్నదే అంబేద్కర్ ఆశయం అని.. కానీ ఆశయం నెరవేరలేదని అన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరం అన్నారు ప్రకాశం అంబేద్కర్. ఆయన ఆదర్శాలను పాటించడమే ఆయనకి నిజమైన నివాళి అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకు వెళుతున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన దళితులు, ఆదివాసీలకే పరిమితం కాదని.. కుల మైనారిటీలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ స్థాయి నాయకుడు ఎవరూ లేరని.. స్థానిక నేతలకు జాతీయస్థాయి నేతలుగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉందన్నారు.