వందే భారత్ రైలు.. ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు నగరాల్లో ప్రవేశపెట్టి రైల్వే సర్వీసు. అయితే ఇది దేశంలోని అన్ని రైళ్లకన్నా అత్యంత వేగంగా నడుస్తోందని అందరూ భావించారు. కానీ అలా జరగడం లేదని తెలుస్తోంది. దేశంలోని అన్ని రైళ్లకన్నా అత్యంత వేగంగా నడవాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిర్దేశిత వేగాన్ని అందుకోలేకపోతోందా? ఈ ప్రశ్నకు రైల్వే శాఖ నుంచి అవుననే సమాధానం వస్తోంది.
ఈ మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు కోరుతూ సమర్పించిన దరఖాస్తుకు రైల్వే అధికారులు సమాధానం ఇచ్చారు. వందే భారత్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడవాల్సి ఉన్నా రైలు పట్టాల స్థితిగతులు అందుకు సహకరించడం లేదని తెలిపారు. అందువల్ల గత రెండేళ్లలో వందే భారత్ సగటు వేగాన్ని గంటకు 83 కిలోమీటర్లకు తగ్గించుకోవలసి వచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు.