ప్రభుత్వంపై అసంతృప్తి..ప్రజలు విరుచుకుపడతారు – విజయసాయి రెడ్డి

-

ప్రభుత్వంపై అసంతృప్తి..ప్రజలు విరుచుకుపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. దేశంలోగాని, ఏదైనా రాష్ట్రంలోగాని ప్రజా ప్రభుత్వాల పాలనపై అసంతృప్తి పెల్లుబికినపుడు జనం రాజకీయాలపైన, రాజకీయపక్షాలపైన విరుచుకుపడుతుంటారు. సరైన పరిపాలన అందించలేని ఆయా పాలకపక్షాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. కాని, కొన్ని సందర్భాల్లో జనం మొత్తంగా రాజకీయాలను, రాజకీయ పార్టీను దుయ్యబడుతూ ప్రజాస్వామ్యానికి పార్టీల వల్లే కీడు జరుగుతున్నట్టు మాట్లాడడం అభిలషణీయం కాదని వెల్లడించారు.

ఎందుకంటే రాజకీయపక్షాలు లేని ప్రజాస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదు. రాజకీయ పార్టీల ఉనికి ప్రజల ఆదరణ, మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఓటర్లే నాయకులను లేదా ప్రజా ప్రతినిధులను (చట్టసభల సభ్యులను) ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రజలకు తమకు నచ్చిన పార్టీలను, నేతలను గద్దెనెక్కించడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటర్లకు ఎనలేని అధికారాలు అందిస్తున్నాయన్నారు సాయిరెడ్డి.

అయితే, కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయపక్షాలు అధికారం కోసం పోటీపడే బహుళపక్ష ప్రజాస్వామ్యం అవసరం ఇంకా ఉంది. పార్టీ రహిత ప్రజాస్వామ్యం మెరుగైనదని ప్రఖ్యాత రాడికల్‌ హ్యూమనిస్టు ఎం.ఎన్‌.రాయ్‌ వాదించినా ఇప్పటికిప్పుడు పార్టీలు లేని ప్రజాస్వామ్యం అమెరికా వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం సాధ్యం కాదు. శాంతియుత పద్ధతిలో పాలకపక్షాలను మార్చడానికి ప్రజలకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news