హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో ఓ ఆస్పత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఆయన తల్లి ఆరోపించారు. హమీర్పుర్ జిల్లాలో ఏప్రిల్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వియషంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్.. విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే.. సుఖ్విందర్ సింగ్ సుఖు తల్లి సంసారో దేవి ఏప్రిల్ 9న కడుపునొప్పితో నాదౌన్ సివిల్ ఆస్పత్రికి వెళ్లారు. ఆమె వెంట ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని సంసారో దేవి ఆరోపించారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజే సీఎం సుఖ్విందర్.. హమీర్‌పుర్‌లో పర్యటించారు. జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్ 10న హమీర్పుర్ చేసుకున్న సుఖ్విందర్.. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను (సీఎమ్ఓ) వివరణ కోరారు. అనంతరం డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు.
అయితే, షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన డాక్టర్.. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని.. రోగితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరినట్లు చెప్పారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు సమాధానమిచ్చాడు. వైద్యుడి స్పందన అనంతరం.. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే అగ్నిహోత్రి.