హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో నగరం అస్తవ్యస్తమవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే గత శనివారం రోజున కురిసిన వర్షానికి ఓ చిన్నారి ప్రాణం బలైపోయిన విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ కళాసిగూడలో శనివారం రోజున నాలాలో పడి మౌనిక అనే చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం తన తమ్ముడితో కలిసి పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లిన మౌనిక నాలాకు రంధ్రం పడి ఉన్న విషయం గమనించకుండా అందులో పడిపోయింది. ఈ క్రమంలోనే నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందింది.
చిన్నారి మౌనిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. మౌనిక కుటుంబ సభ్యులను మంత్రి తలసాని ఇవాళ ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చెక్కును అందించారు. భవిష్యత్‌లోనూ మౌనిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు.