తెలంగాణలో అమర్ రాజా పెట్టుబడులు.. మరి ఏపీకి ఏం రోగం – RRR

-

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దగ్గరగా అమర్ రాజా బ్యాటరీ సంస్థ ప్లాంటుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేశారని, తిరుపతి పరిసరాలను దాటి వెళ్లడం ఇష్టం లేని గల్లా రామచంద్ర నాయుడు గారు స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 నుంచి 50 వేల మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారని అన్నారు. నా జన్మభూమి పుణ్యభూమి అనుకునే గల్లా రామచంద్ర నాయుడు గారు ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో పెట్టుబడులను పెడుతున్నారని, దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి అన్నది నిర్వివాదాంశం అని అన్నారు రఘురామ.


తన చుట్టూ ఉన్న నలుగురితో మీటింగులు పెట్టి, ముఖ్యమంత్రి గారు వారికి వేల ఎకరాల భూములను కట్టబెడుతున్నారని, వాటాలు ఇవ్వనందుకు పెట్టుబడులను పెట్టే పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమి వేస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపదను సృష్టిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సంపదను తుంచేస్తున్నారని, హైదరాబాద్ క్షణక్షణాభివృద్ధి చెందుతోందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి బయోపిక్ లో తమిళ హీరో జీవా గారు నటించనున్నారని, వారు బయోపిక్ తీస్తే, తాము భయో పిక్ తీస్తాం అని, జగన్ మోహన్ రెడ్డి గారి అరాచకాలన్నింటిని భయోపిక్ లో చూపిస్తాం అని, ఆ సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజే, తమ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అని, అది రిలీజ్ చేసిన రోజే, ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం అని, ఆ సినిమా ఒక్కరోజు ఆడితే, తమ సినిమా రెండు రోజులు ఆడుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర నాయకుడు గోనె ప్రకాష్ రావు గారి వ్యాఖ్యలతో తాను పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నానని, గతంలో నక్కకు నాగలోకానికి అనే సామెత వాడే వారని, రానున్న రోజుల్లో వై.యస్.ఆర్. గారి పాలనకు, జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు ఉన్నంత తేడా అని మాట్లాడుకుంటారని అన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత తమ పార్టీ పరిస్థితి శంకరగిరి మాన్యాలే అన్నట్టుగా తయారయిందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తమకు కనీస ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందో లేదో చూడాలని అన్నారు. నెల్లూరు, అనంతపురం, ఇప్పుడు ఒంగోలులో తిరుగుబాటు మొదలయ్యిందని, త్వరలోనే చిత్తూరు జిల్లాలో ఒక రెడ్డి తిరుగుబాటు చేయనున్నారని, మే 14వ తేదీ నాటికి తనను నిర్బంధించి, లాకప్లో చిత్రహింసలకు గురిచేసి రెండేళ్లవుతుందని, అయినా ఇప్పటి వరకు తాను దాఖలు చేసిన కస్టోడియల్ టార్చర్ పిటిషన్ విచారణకు రాలేదని, సుప్రీంకోర్టులో, హైకోర్టులో విచారణకు రాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారని, లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ కూడా తనని హింసించిన అధికారులను పిలిచి విచారించలేదని, ఇదే విషయమై తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కలవాలని నిర్ణయించుకున్నానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news