తలసరి ఆదాయంలో ఏపీ దూసుకుపోతోందని తెలిపారు విజయ సాయిరెడ్డి. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమేనని తెలిపారు.
ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం అని వివరించారు.
ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయని వివరించారు.