రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఈ వ్యవహారానికి సంబంధించి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 24కు, అరెస్టులు 23కు చేరాయి.
హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి, వరంగల్ నివాసి మనోజ్ స్నేహితులు. వీరికి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌కుమార్ (ప్రధాన నిందితుడు)తో పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ప్రశ్నపత్రాన్ని ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలిచ్చి అతని వద్ద కొనుగోలు చేశారు.
పోలీసులు ప్రవీణ్‌ను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినా నోరు మెదపలేదు. అతని ఫోన్‌కాల్ డేటా, బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు గ్రూప్-1, ఏఈ, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ప్రశ్నపత్రాలు మాత్రమే విక్రయించారని భావించారు. ప్రస్తుతం ఏఈఈ ప్రశ్నపత్రం కూడా బహిర్గతమైనట్లు నిర్ధారణకు వచ్చారు.