గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ బిగ్ షాక్. అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే గ్రామ, వార్డు వాలంటీర్లపై వేటువేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిపై వచ్చే ఫిర్యాదులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నగరాలు, పట్టణాల్లో వార్డు పరిపాలన కార్యదర్శులు విచారించనున్నారు. వాలంటీర్లపై చర్యలు తీసుకునే అధికారం మండల పరిషత్ అభివృద్ధికారి (ఎంపీడీవో), పుర, నగరపాలక కమిషనర్లకు కల్పించారు.
ఇందుకు సంబంధించి సచివాలయశాఖ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. నెలకు రూ.5000 గౌరవ వేతనంపై ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరిలో తప్పుచేసే వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటివరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు లేవు. తొలగించే విషయంలో స్పష్టత లేకపోవడంతో పరిపాలన, న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సచివాలయశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.