జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలను ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన పార్టీ లేదని అన్నారు. బలాన్ని భేరీజు వేసుకుని రాజకీయాలలో ముందుకు వెళతామని.. అవసరమైనప్పుడు తగ్గి, బలం ఉన్నప్పుడు బెబ్బులిలా తిరగబడాలని సూచించారు. పొత్తులను తక్కువ చేసి చూడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కళ్యాణ్.
పొత్తులు పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతాయని అన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా పొత్తులతో వచ్చి ఇప్పుడు జాతీయస్థాయిలో బిఆర్ఎస్ గా ఏర్పడిందని గుర్తు చేశారు. పొత్తులు వద్దంటూ తనకు ఇప్పుడు సలహాలు ఇచ్చేవారు గత ఎన్నికలలో ప్రచారం కూడా చేయలేదని మండిపడ్డారు. ఇక ఎన్నికల తర్వాతే సీఎం కుర్చీ గురించి మాట్లాడుకుందామని.. అన్ని బాగుంటే వచ్చే ఎన్నికలలో జనసేన, టిడిపి, బిజెపి కలిసి పోటీ చేస్తాయని అన్నారు.
ముఖ్యమంత్రి ఎవరు అనేది ముఖ్యం కాదని.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని గద్దెదించడమే తమ లక్ష్యం అని అన్నారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బలాబలాలను బట్టి నిర్ణయించుకుంటామన్నారు. ఇక కష్టాలు వచ్చినప్పుడు తాను గుర్తుకు వస్తాను తప్ప ఎన్నికలప్పుడు కాదా..? అని ప్రశ్నించారు. ప్రజలు మోసం చేసే వాడిని నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు.