తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలా ఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) కసరత్తు చేస్తోంది. అన్ని గురుకులాలకు ప్రభుత్వం 11,687 పోస్టులను మంజూరు చేసింది.
ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 10,675 కాగా, మిగిలినవి 1,012 బోధనేతర పోస్టులు. బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బోధనేతర సిబ్బంది పోస్టుల్లో స్టాఫ్ నర్స్ పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్- 3, గ్రూప్- 4 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. ట్రిబ్ మొత్తంగా 10,675 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఇందులో తొలిదఫాగా 9,231 పోస్టుల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.