జీవో నెంబర్ 1 పై న్యాయస్థానం తీర్పు అంటూ ఇస్తే కొట్టివేయడం ఖాయమని తాను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నానని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తాను పలుసార్లు రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రస్తావించానని పేర్కొన్నారు. తీర్పు ఆలస్యం చేయగలరు కానీ, తీర్పు మరొక రకంగా ఉండదని చెప్పానని, రాజ్యాంగం చదువుకున్నవారు ఎవరు కూడా జీవో నెంబర్ 1 ని సమర్ధించే అవకాశమే లేదని, జీవో నెంబర్ 1 రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు పూర్తి భిన్నంగా ఉందని, ప్రజల ఓర్పును పరీక్షిస్తూ, ఐదు నెలల తర్వాత తీర్పు ఎట్టకేలకు వెలువరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారుకి కృతజ్ఞతలు తెలిపారు.
జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులకు పూర్తి వ్యతిరేకమని, ఈ జీవోను జారీ చేసిన వారిని న్యాయస్థానానికి పిలిచి చెప్పుతో కొట్ట లేదంతే… కానీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా చెప్పుతో కొట్టినంత పని చేశారని, జీవో నెంబర్ 1ని న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ, సాక్షి దినపత్రికలో మాత్రం చట్ట ప్రకారం మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చునని వార్త కథనం రాయడం హాస్యాస్పదం అని అన్నారు. కోర్టు చేయని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా సాక్షి దినపత్రిక వార్తా కథనం రాయడం పరిశీలిస్తే ఇదేమి జర్నలిజం అన్న అనుమానం రాక మానదని, జీవో నెంబర్ 1 పై రాష్ట్ర హైకోర్టులో తీర్పు ఆలస్యం కాగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు త్వరగా తీర్పు వెలువరించాలని మార్గదర్శకాలు జారీ చేసిన 20 రోజుల తర్వాత రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించిందని అన్నారు.