హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లోని వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రవేశించిన ఆగంతుకుడు రూ.10 లక్షలు తీసుకుని ఉడాయించిన కేసులో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 2.40 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు తెల్లవారేదాకా ఎవరితోనో చాటింగ్ చేశాడు. నవ్య చరవాణి నుంచే ఓలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లగానే.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ మండల క్రైం విభాగం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
‘ఆగంతుకుడు ముందుగా రెక్కీ నిర్వహించి రాత్రి 10 గంటలకే ఇంటి ప్రాంగణంలోకి చేరుకున్నాడు. పనిమనిషి గమనించినా తమ యజమాని బంధువుల డ్రైవర్‌గా భావించింది. చోరీ అనంతరం క్యాబ్‌లో షాద్‌నగర్ వెళ్లిన ఆగంతుకుడు అక్కడ ఒక వస్త్ర దుకాణంలో తాను ధరించిన కోటు తొలగించి మరో దుస్తులు ధరించాడని, మధ్యాహ్నం వరకు షాపింగ్ చేసినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించాం.’ అని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.