తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత సిబ్బంది అని నమ్మించి రూ. 17.60 లక్షలు కాజేశారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఉత్పత్తుల సరఫరా వ్యవహారంలో మంత్రి సబితా వ్యక్తిగత సిబ్బంది అంటూ మోసానికి పాల్పడిన ఏడుగురిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసి మానేసిన ఉద్యోగి పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఉత్పత్తుల సరఫరా చేయడానికి కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించారు. విద్యార్థులకు స్కూలు షూస్, బ్యాగులు, సాక్స్ లు సరఫరా చేసేందుకు హర్యానా రాష్ట్రం కర్నాల్ లోని ఆల్ఫా ఇంటర్నేషనల్ సిటీకి చెందిన లిబర్టీ షూస్ సంస్థ ప్రతినిధులు మంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత జీకే కుమార్, రమేష్ రెడ్డి, తేజ, ఆంజనేయులు అనే వ్యక్తులు లిబర్టీ షూస్ నిర్వాహకులను సంప్రదించారు.
వీరు మంత్రి సబితా వ్యక్తిగత సిబ్బందిని మోసం చేసి.. ఆ కాంట్రాక్ట్ కోసం 17,65,000 అడ్మినిస్ట్రేటివ్, ఇతర చార్జీల నిమిత్తం చెల్లించాలని మోసానికి పాల్పడ్డారు. అయితే ఇదంతా ఫేక్ అని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కుమార్ సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.