సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే.శరత్ బాబు మరణ వార్త విని ఎందరో ప్రముఖలు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. శరీరం అంతా ఇన్ ఫెక్షన్ కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతినడంతో ఆయన మృతి చెందినట్టు ఏఐజీ వైద్యులు కూడా వెల్లడించారు.
శరత్ బాబు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. శరత్ బాబు గారు విలక్షణమైన, సృజనాత్మక నటుడు అని కొనియాడారు. తన సుదీర్ఘ సినీ జీవితంలో అనేక భాషల్లో, అనేక పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారని కీర్తించారు. శరత్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం విచారకరం అని మోదీ పేర్కొన్నారు.