విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌లో కొన్ని సన్నివేశాలు, తీసిన విధానంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు వెంకటేశ్ స్పందించలేదు. కానీ తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్‌పై తొలిసారిగా వెంకీ మాట్లాడారు. ఈ సిరీస్‌లో కొన్ని సీన్స్.. కొందరిపై ప్రభావం చూపిన మాట వాస్తవమేనని అన్నారు.
అభిరామ్ దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న ‘అహింస’ చిత్ర ప్రచారంలో పాల్గొన్న వెంకటేశ్‌ను ‘రానా నాయుడు’పై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌పై మీ స్పందన ఏంటి? అని విలేకర్లు అడగ్గా ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘రానానాయుడు’ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందుకు వెళ్లిపోవడమే మంచిదని నేను నమ్ముతా. తర్వాతి సీజన్ అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాం. అలాగని అందరినీ మెప్పించడం కూడా కష్టమే. ’’ అని వెంకటేశ్ అన్నారు.