భారీ వర్షాలు దిల్లీని అతలాకుతలం చేశాయి. ముంచుకొచ్చిన వరదతో యమునా నది గత రెండ్రోజుల నుంచి ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో ప్రవహించింది. అయితే ఇవాళ యమునా ప్రవాహం కాస్త నెమ్మదించింది. అయినా దిల్లీలో మాత్రం వరద ప్రభావం తొలగిపోలేదు. రాజధాని నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటికీ మురికి కాలువలు పొంగుతుండటంతో దిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు. భైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్‌లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ఈ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఆరాతీశారు.
దిల్లీలో వరదనీటి ప్రభావం కొనసాగుతుండటంతో విద్యాసంస్థలను జులై 16 వరకు మూసివేశారు. నిత్యావసరాలు మినహా భారీగా సరకు తరలించే వాహనాల రాకపై అధికారులు ఆంక్షలు విధించారు. అలాగే దిల్లీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రెగ్యులేటర్ దెబ్బతినడం ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేసింది. దీనివల్ల యమునా నది నీళ్లు తిరిగి నగరంలోకి ప్రవేశిస్తున్నాయి.