నేనూ చీరాల్లో పెరిగాను. చీరాల అనగానే చిన రధం.. పెద్ద రధం.. జాలరీ పేట గుర్తొచ్చాయి. ఆమంచి స్వాములు చీరాలలోనే బలం ఉందని అనుకున్నాను. కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుంచి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదు. వచ్చిన అభిమానులు.. కార్యకర్తలను చూసి ఆశ్చర్యపోయానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేనలో చేరడం చాలా ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఆమంచి స్వాములకు పార్టీ కండువా కప్పిన అనంతరం పవన్ మాట్లాడారు.
ఆమంచి స్వాములును మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. కార్యకర్తలకు అండగా నిలబడి, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయగల ఆమంచి స్వాములు వంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకునేవాడ్ని. ఇవాళ ఆయన పార్టీలోకి రావడం శుభపరిణామం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం అని వ్యాఖ్యానించారు పవన్.
కాగా, సోమవారం నాడు తాను తిరుపతి వెళ్లనుండడంపైనా పవన్ కల్యాణ్ మాట్లాడారు. “శ్రీకాళహస్తిలో మన నాయకుడిపై చెయ్యి పడింది అంటే అది నాపై పడినట్టే. అందుకే తిరుపతి వెళుతున్నాను, తేల్చుకుంటాను. జనసేనలోని ఏ ఒక్క నేతపై, కార్యకపై అయినా దాడి జరిగితే అది నాపై జరిగినట్టే భావిస్తాను… నేను వచ్చి నిలబడతాను… జాగ్రత్త!” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.