రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు.ఆదివారంనాడు ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ది శూన్యమని ఆమె విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్రం మళ్లిస్తుందని ఆమె ఆరోపించారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ లు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని పురంధేశ్వరి చెప్పారు.
బీజేపీ, జనసేన పార్టీలు తాము కలిసే ఉన్నామని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేస్తుండగా, ఇటీవల పవన్ కల్యాణ్ కు ఎన్డీఏ భేటీ కోసం ఆహ్వానం అందడం, ఆయన హాజరుకావడం… ఈ అంశాలతో ఆ రెండు పార్టీల భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరికి ఇదే తొలి రాజకీయ పర్యటన.