రేవంత్ క్రేజ్ చూసి ఈ లీడ‌ర్లు కుళ్లు కుంటున్నారా…!

-

గతమెంతొ ఘనం….ప్రస్తుతం అథమం. ఇదే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్ర విభజన ముందు వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి దారుణమైపోయింది. ఆ పైగా ఎమ్మెల్యేలు అంతా అధికార టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. అలాగే పంచాయ‌తీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక తాజాగా తమ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో తెలుసు.

అయితే గతంలో దివంగత వైఎస్సార్ లాగా పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఏర్పడిందనే చెప్పొచ్చు. ఉండటానికి చాలామంది సీనియర్లు ఉన్న వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడంలో బిజీగా ఉన్నారు. వీరికి నియోజకవర్గాల్లో తప్ప రాష్ట్రం మొత్తం పెద్దగా ప్రజాకర్షణ లేదు. కానీ వైఎస్ అంత కాకపోయిన ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డినే. టీడీపీలో మంచి నాయకుడుగా ఎదిగిన రేవంత్…కాంగ్రెస్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

రాష్ట్రంలో ఎక్కడకెళ్లిన రేవంత్ కు అభిమానులు ఉన్నారు. అయితే ఇదే క్రేజ్ ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. దీని వల్ల ఎక్కడ తమని డామినేట్ చేసేస్తాడేమో అని భయపడిపోతున్నట్లు కనిపిస్తోంది. పైగా త్వరలో ఢిల్లీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. దాంతో సీనియర్లు రేవంత్ కు పదవి రాకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నేత వి హనుమంతరావు…రేవంత్ విషయంలో ఒంటికాలి మీద లేస్తున్నారు.

ఇటీవల ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనిపై తమ సమాచారం లేదని, రేవంత్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శలు చేశారు. ఇక తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం టీ పీసీసీ కోర్ కమిటీ నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో వీహెచ్… రేవంత్ రెడ్డి అంశాన్ని లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి పాల్గొన్న సభల్లో ఆయనను సీఎం సీఎం అనే నినాదాలు చేయడాన్ని వీహెచ్ తప్పుబట్టారు. రేవంత్ కు ఇంత అతి పనికి రాదని, సీఎం కాకముందు వైఎస్ కూడా ఇలాంటివి చేయలేదని ఫైర్ అయ్యారు. ఇక కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ క్రేజ్ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news