ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం జగన్. వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ. 2 వేలు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు సీఎం జగన్. కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందిస్తామని ప్రకటించారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అక్కడ వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునే విధానం పూర్తిగా మార్చేశామని అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజులపాటు అధికారులు బాధిత గ్రామాలలోనే ఉంటూ సాయం అందిస్తారని తెలిపారు. ఇప్పటికే బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, కూరగాయలు అందిస్తున్నామని..ఇల్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేల ఆర్థికసాయం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ఉంచుతామన్నారు.