ఆగస్టు 14 నుంచి 24 వరకు విద్యార్థులకు ఉచితంగా ‘గాంధీ’ మూవీ

-

భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 582 సినిమా థియేటర్లలో ఈనెల 14వ తేదీ నుంచి 24 వరకు ‘గాంధీ’ సినిమాను విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను థియేటర్ల వద్దకు తీసుకొచ్చి, తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించనుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ‘గాంధీ’ చిత్రప్రదర్శనపై సమావేశం నిర్వహించారు.

మహాత్మాగాంధీ జీవనశైలి, మానవతా విలువలను నేటితరానికి తెలియజేసేందుకు నిరుడు ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని థియేటర్లలో తొలిసారిగా ప్రదర్శించిన గాంధీ చిత్రానికి విశేష స్పందన లభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముగింపు వేడుకల్లోనూ విద్యార్థులకు మరోసారి జాతీయ స్ఫూర్తిని కలిగించేందుకు ఈ సినిమాప్రదర్శన చేపడతామని చెప్పారు. రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news