మరో పడవ ప్రమాదంలో భారీ సంఖ్యలో వలసదారులు దుర్మరణం చెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ తెలిపింది.
జులై 10వ తేదీన సెనెగల్ నుంచి 100 మంది వలసదారులతో బయలుదేరిన పడవ మునిగిపోయినట్లు స్పెయిన్‌కు చెందిన ఓడ సిబ్బంది గుర్తించారు. అనంతరం కేప్ వర్డియన్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరో 56 మంది గల్లంతవ్వగా.. వారు కూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. చేపలు పట్టే చిన్న పడవలో బయలుదేరిన వలసదారులు స్పెయిన్‌కు వెళ్తున్నట్లు సమాచారం.