ఏపీలో ప్రస్తుత పాలన.. రాజకీయ పరిస్థితులు.. ప్రజల జీవన గతి.. ఇలా అన్నీ బేరీజు వేసి చూస్తే వైఎస్సార్సీపీ పాలన కంటే టీడీపీ పాలనే బెటర్ అనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో తప్పకుండా కొత్త సర్కార్ వస్తుందని చెప్పారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన పవన్.. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున భూముల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తోందని తెలిపారు. జగన్.. రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని విమర్శించారు. బ్రిటీష్ హయాం కంటే తీవ్రంగా విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది జనసేన ప్రభుత్వమా.. జనసేన, టీడీపీ కలిపిన ప్రభుత్వమా.. ఏదైనా, ఏ ప్రభుత్వమైనా సరే నేరస్థులను వదిలిపెట్టం అని పవన్ హెచ్చరించారు.