ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తం అయినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమతం చేసినట్టు వివరించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి.. మానిటర్ చేస్తుండాలని ఆదేశించారు సీఎస్.
వాయువ్య బంగాలఖాతం.. పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని.. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం చురుకుగా ఉందని.. రెండు, మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలోఉత్తర ఒడిశా-ఉత్తర ఛతీస్ ఘడ్ వైపు వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది వాతావరణ కేంద్రం.