తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ సీఎం కేసీఆర్ సిద్ధం చేశారు. ఈనెల 21న ప్రకటించనున్న విషయం తెలిసిందే. కొంత మంది సిట్టింగ్ లకు నిరాశ మిగలనున్నట్టు సమాచారం. వారిలో ముఖ్యంగా జనగాం, స్టేషన్ ఘనపూర్, ఖమ్మంలో ఇద్దరూ, వరంగల్ ఇద్దరూ, కరీంగనగర్ లో ఇలా 11 మంది సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్ కేటాయించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి నిరాశ తప్పడం లేదు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కవితతో భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప్పల్ నియోజకవర్గంలో పరిస్థితిని వీరిద్దరూ కవితకు వివరించారు. వీరిద్దరిలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా ఓకే అని కవితను కోరినట్టు సమాచారం. సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.