జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ గార్డెన్ తాజాగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలతో ఆసియాలో అతి పెద్ద గార్డెన్‌గా ఈ ఘనత సాధించింది. ఈ మేరకు శనివారం జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. శ్రీనగర్ తులిప్ గార్డెన్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం పట్ల ప్రధాని మోదీతో పాటు జమ్మూ కశ్మీర్ నేతలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.