ఆ ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధం.. వస్తే శాపగ్రస్తులై వితంతువులు అవ్వాల్సిందేనట

-

కొన్ని ఆలయాల్లోకి మహిళలు వెళ్లకూడదు అంటారు. అలాగే కొన్ని ఆలయాలకు పురుషులు వెళ్లకూడదు. ఇలాంటి నియమాలు మన దేశంలో ఇంకా కొన్ని ఆలయాలకు ఉన్నాయి. అందులో ఒకటి కేరళలోని శబరిమల ఆలయం. జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయంలో కూడా ఇలాంటి ఆంక్షలు మహిళలపై ఉంటాయి. హర్యానాలో కూడా ఒక టెంపుల్‌లో ఆడవారికి ప్రవేశం లేదు. మహాభారత యుద్ధం జరిగిన పవిత్ర నగరంగా చెప్పుకునే కురుక్షేత్రంలో ఈ దేవాలయం ఉంది. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన పవిత్రమైన జ్ఞానాన్ని బోధించాడట.

కురుక్షేత్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక దేవాలయంలోకి మహిళలను అడుగుపెట్టనివ్వరు. ఈ టెంపుల్ మహిళలకు చాలా అశుభమైనదిగా భావిస్తారు. ఇది ధర్మనగరి కురుక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహోవాలో ఉంది. దీనిని శివుని కుమారుడైన కార్తికేయకు అంకితం చేశారు. ఈ దేవాలయంలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం. ఈ గుడి ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, కర్నాల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పంజాబ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

మహిళలు అడుగుపెడితే వితంతువు అవుతారట..

కార్తికేయ టెంపుల్‌లో అడుగుపెట్టిన ప్రతి మహిళ వితంతువుగా శాపానికి గురవుతుందని నమ్ముతారు. ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పే స్టోరీలు చాలా ఉన్నాయి.. ఒక కథనం ప్రకారం, ఒక మహిళ ఒకరోజు ఆలయంలోకి ప్రవేశించి, అనుకోకుండా శివుని పవిత్రమైన శివలింగాన్ని తాకుతుంది. దానితో అపవిత్రమయ్యానని శివునికి బాగా కోపం వస్తుంది. ఆ కోపంలో పరమేశ్వరుడు ఆ స్త్రీని వితంతువుగా ఉండమని శపిస్తాడట.

మరొ కథనం ప్రకారం, పూర్వకాలంలో మహిళల గుంపు గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, వారిని ఒక పురుషుల గుంపు అడ్డుకుంది. పీరియడ్స్ అంటుతో ఉన్నందున లోనికి అనుమతించడం లేదని, పీరియడ్ బ్లడ్ ఆలయాన్ని అపవిత్రం చేస్తుందని పురుషులు మహిళలకు చెప్పారు. అప్పటినుంచి ఇదే నిబంధన కొనసాగుతోంది.

ఈ ఆలయంలో కార్తికేయ స్వామి పవిత్రమైన బ్రహ్మచారి రూపాన్ని పూజిస్తారు. అందుకే ఈ గుడిలోకి ప్రవేశించడానికి మహిళలకు అనుమతి లేదని అంటారు. ఒకవేళ ఆడవారు ఈ దేవాలయంలోకి అడుగు పెడితే, వారు ఏడు జీవితాల పాటు వితంతువు జీవితాన్ని గడిపే శాపం తగులుతుందట. టెంపుల్ బయట ఆడవారికి ప్రవేశం నిషేధమని తెలిపే ఒక బోర్డు కూడా ఉంటుంది.

ఈ ఆలయంలో కార్తికేయుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. కార్తికేయుడు తన తల్లి పార్వతిపై కోపం తెచ్చుకొని తన రక్తాన్ని, మాంసాన్ని అగ్నికి అర్పించాడు. దీంతో అప్పుడు పెహోవా తీర్థయాత్రను సందర్శించమని శివుడు కార్తికేయుడికి చెప్పాడు. ఋషులు కార్తికేయుని మండుతున్న శరీరానికి ఆవనూనె పూసి చల్లదనాన్ని అందించారు. కార్తికేయుడు శాంతిస్తాడు. పెహోవా వద్ద పవిత్రమైన రాయి రూపంలో స్థిరపడ్డాడు. అందుకే ఇక్కడి దేవతా మూర్తికి ఆవ నూనె సమర్పిస్తారట..

Read more RELATED
Recommended to you

Latest news