తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులకు రాష్ట్ర బీజేపీ ఆహ్వానం పలికింది. ఇందుకోసం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలో నాలుగు పార్ట్‌లు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు?.. వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పార్ట్-2లో ఎక్కడి నుంచి పోటీ చేశారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి. ఇక పార్ట్4లో క్రిమినల్ కేసులేమైనా ఉంటే.. ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
దీంతో బీజేపీ టికెట్ కోసం అన్ని నియోజకర్గాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. బీజేపీకి కాస్త పట్టు ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం బలమైన అభ్యర్థులకు బీజేపీ టికెట్ కేటాయించనుంది. రాష్ట్రం, కేంద్ర అధిష్టానం స్థాయిలో స్క్రూటినీ నిర్వహించిన తర్వాత ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో చివరికి వరకు టికెట్ ఎవరికి వస్తుందనేది ఊహించడం కష్టంగా మారింది.