అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకొని ఇప్పుడు దశాబ్దిలో ఫలితాలు చూస్తున్నామని తెలిపారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో అద్భుత ఫలితాలు చూస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్- 2022 దక్కిందని కేసీఆర్ గుర్తు చేశారు.
‘ఎంత అభివృద్ది సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం. పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నాం. మనతో పాటు, భవిష్యత్ తరాలు కూడా పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హరిత తెలంగాణ కోసం మన లక్ష్యమైన పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం. అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకం. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి.’ అని సీఎం కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.