టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పలు పార్టీల నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ నేత అఖిలేష్ యాదవ్ చంద్రబాబు అరెస్టును ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు.
చంద్రబాబు నాయుడును ఏపీ సర్కార్ అరెస్టు చేసిన విధానం సరైంది కాదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందని అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని బండి సంజయ్ తెలిపారు.