తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బిఆర్‌ఎస్..రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్..మూడోసారైనా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ సారి తెలంగాణ లో పాగా వేయాలని బిజేపి చూస్తుంది. ఇలా మూడు పార్టీల మధ్య రసవత్తర పోటీ ఉంది.
కాకపోతే ఇక్కడ బిజేపిని పక్కన పెట్టవచ్చు. ఆ పార్టీ బలం మొన్నటివరకు బాగానే ఉంది..కానీ ఇటీవల తగ్గిపోయింది. 20 శాతం వరకు ఉండే బిజేపి బలం 10 శాతానికి పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. దీని వల్ల బిజేపి సొంతంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవడం కష్టమైన పని. కాకపోతే కొన్ని సీట్లలో గెలుపోటములని ప్రభావితం చేస్తుంది. ఓట్లని చీలుస్తుంది. ఇక ప్రధాన పోటీ మాత్రం బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. అయితే ఎంత కాదు అనుకున్న బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు రేసులో ముందు ఉంది. కానీ బిఆర్‌ఎస్ ప్రభావం నిదానంగా తగ్గుతుందని, కాంగ్రెస్ బలం పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.
ఇప్పటికే పలు సర్వేలని చూస్తే బిఆర్‌ఎస్ పార్టీకి దాదాపు 40 శాతం ఓటింగ్ చూపిస్తున్నారు. గతంలో ఇది 45 శాతం పైనే ఉండేది. ఇప్పుడు నిదానంగా తగ్గుతుంది. ఇటు కాంగ్రెస్ ఓటింగ్ శాతం 25 శాతం నుంచి 35 శాతం దగ్గరకు వెళుతుందని తెలుస్తోంది. తాజాగా చూస్తే బిఆర్‌ఎస్ ఓటింగ్ శాతం 39 శాతం వరకు ఉంటే, కాంగ్రెస్ ఓటింగ్ శాతం 33 ఉందట..అంటే రెండు పార్టీల మధ్య 6 శాతం తేడా ఉంది. అటు బిజేపికి 9 శాతం వరకు మద్ధతు ఉందట. ఇతర పార్టీలకు 5 శాతం వరకు ఓటింగ్ ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇక దాదాపు 10 శాతం పైనే న్యూట్రల్ ఓటు బ్యాంకు ఉంది. రానున్న ఎన్నికల్లో వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే గెలుపు.