రష్యాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ గ్రూప్‌నకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ కాంట్రాక్టు సేనకు ఓ అధినాయకుడిని వెతికారట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. తనకు అత్యంత సన్నిహుతుడు, నమ్మకస్థుడైన వ్యక్తికి ఆ పగ్గాలు అప్పగించారట. ఇంతకీ అతను ఎవరంటే..?
వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ అనుమానాస్పద మృతి అనంతరం ఆ కిరాయి దళ బాధ్యతలను వాగ్నర్ దళపతుల్లో ముఖ్యుడైన ఆండ్రి ట్రోషెవ్‌కు రష్యా అధినేత పుతిన్ అప్పగించారట. రష్యా సైన్యంలో గతంలో అధికారిగా ఉన్న ట్రోషెవ్ 2014 నుంచి వాగ్నర్ గ్రూపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాగ్నర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను కూడా పర్యవేక్షించారు. ఆయనపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది కూడా. ఇక నుంచి ఉక్రెయిన్‌లో పోరాటం కొనసాగించే వాగ్నర్ గ్రూపు దళాలకు నాయకత్వం వహించాల్సిందిగా ట్రోషెవ్‌ను పుతిన్ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.