మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అధికారం వైపు వాలిపోతూ ఉంటారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి అక్కడ అధికారం ఎంజాయ్ చేయడమే ఆయన హాబీ. ఆయనకు పార్టీలు, విలువలు, సిద్ధంతాలు అక్కర్లేదు. ఆయనకు వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం. ఆయనకు కావాల్సింది అల్లా పదవి. తెలుగుదేశంతో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం వయా ప్రజారాజ్యం – కాంగ్రెస్ టు తిరిగి తెలుగుదేశంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు అన్ని పార్టీల్లో తన కులపు నాయకులతో మంచి పరిచయాలే ఉంటాయి.
గంటా పార్టీల కన్నా కులానికే ఎక్కువ ప్రయార్టీ ఇస్తారన్న ఆరోపణలు ఎక్కువే. ఇక ఎనిమిది సంవత్సరాలుగా మంత్రిగానే ఉన్న గంటా ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో పాటు టీడీపీకి ఫ్యూచర్ కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో మరోసారి కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారంటూ గత నాలుగు నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక టీడీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడని గంటా ఇప్పటికే పార్టీ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లతో దేశ రాజధానిలో అదే పనిగా చర్చలు జరిపిన గంటా.. తాజాగా ఢిల్లీ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను కలిసి కీలక మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే అయిన గంటా.. తాను పార్టీ మారితే తన మీద అనర్హత వేటు పడుతుందని.. ఈ క్రమంలోనే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకే వీళ్లతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. గంటా తాను పార్టీ మారడంతో పాటు ప్రస్తుతం టీడీపీ, జనసేనలో ఉన్న తన వర్గానికి చెందిన కీలక నేతలు అందరితో కట్ట కట్టుకుని మరీ కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గంటాతో పాటు పార్టీ మారే ఎమ్మెల్యేల్లో విశాఖ జిల్లాలోనే ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు (వీరిలో ఒకరు గంటా ఏం చెపితే అది చేయడానికి రెడీ), ఇక తూర్పు గోదావరి జిల్లాలో మరో కీలక నేత, కోస్తా జిల్లాల్లో మరో ఎమ్మెల్యే రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా క్యాస్ట్ ఈక్వేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు వర్గం మెయింటైన్ చేస్తోన్న గంటా తనతో పాటు మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను అయినా బీజేపీలోకి తీసుకు వెళ్లి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. మరి గంటా రాజకీయం ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.