కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శుక్రవారంనాడు హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి.ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఆయన చెప్పారు.
ఎన్నికల సమయంలో తెలంగాణలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని జేపీ నడ్డా విమర్శించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని నడ్డా చెప్పారు. బీజేపీనే జాతీయ పార్టీగా జేపీ నడ్డా పేర్కొన్నారు.జాతిని ఐక్యంగా ఉంచే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆయన చెప్పారు. సోనియా, రాహుల్, ప్రియాంకలదే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోడీదేనన్నారు. ఇందులో తెలంగాణకి చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని జేపీ నడ్డా చెప్పారు.