తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 20 మంది అధికారులపై వేటు పడింది. నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలను పంపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాల అధికారులతో విస్తృత సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితేఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలు, ఓటర్ల జాబితా రూపకల్పనలో ఈ అధికారుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చింది సీఈసీ. వివిధ స్థాయుల్లో అధికారుల బదిలీలపైనా అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు 2018 ఎన్నికలు, ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా అడ్డుకట్ట వేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో వేటు పడిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీల స్థానంలో తాత్కాలికంగా ఇన్‌ఛార్జులకు బాధ్యతలు అప్పగించారు.