విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వ్యవహారం సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అయిందన్నారు. టీడీపీ మనుగడకు ఈ నాలుగు నెలలే ఆఖరి రోజులు అవుతాయని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో పుట్టి ఉంటే రాజధాని అవసరం ఏంటో ఆయన తెలిసేదన్నారు. స్థానికులు ఆయనకు చెప్పాలని బొత్స చురకలంటించారు. విశాఖకు రాజధాని వస్తే దోపిడి కుదరదని అనుకుంటున్నారా అని సత్యనారాయణ ప్రశ్నించారు.
అటు నారా లోకేష్ అమిత్ షా భేటీపైనా బొత్స తనదైన శైలిలో స్పందించారు. నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలిసినా, బాద్షాను కలిసినా మాకేమీ అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు తప్పు చేశారని కోర్టు భావించినందునే జైలుకు పంపించిందని.. కక్షపూరిత చర్య అంటూ లోకేష్ చేసిన ఆరోపణలపై కేంద్రం విచారణ చేస్తుందన్నారు. చంద్రబాబుకు జైల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని న్యాయస్థానం ఆదేశిస్తూ అమలు చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.