మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాల పుణ్యమా అంటూ దేశంలో ఉల్లిధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయ అలవాటు గా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు దానిని శాస్త్రంగా భావిస్తూ చిన్న ముక్క వేసి సరిపెట్టుకుంటున్నారు. మార్కెట్ లో ఉల్లి ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ వినియోగదారులకు కోయకుండానే ఘాటు చూపిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కొన్ని చోట్ల వంద కూడా అమ్ముతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80 శాతం హైదరాబాద్ మార్కెట్ కు ఉల్లి మహారాష్ట్ర నుంచే వస్తూ ఉంటుంది.
ఇప్పుడు అక్కడ పంట దెబ్బ తినడంతో దేశం మొత్తం ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. అటు రాజస్థాన్, బీహార్ లో కూడా ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. దేశం మొత్తం ఉల్లి కొరత ఉండటంతో కేంద్రం ధరలను అదుపు చేయడంతో పాటుగా కొరతను తగ్గించేందుకు, ఇరాన్, ఈజిప్టు, టర్కీ దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే చర్యలు మొదలుపెట్టింది. ఇవి దేశ రాజధానికి చేరితో ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి మార్కెట్ లో కీలకంగా ఉండే కర్నూలులో వింత పరిస్థితి ఏర్పడింది.
గత వారం రోజుల నుంచి రైతులు ఉల్లి తెస్తే కొనే నాథుడే కనపడటం లేదు. అధికారుల అలసత్వం, ఆలస్యం చేయడంతో రైతులు ఉల్లి నిల్వలతో మార్కెట్ లోనే ఉండే పరిస్థితి దాపురించింది. కర్నూలు మార్కెట్ లో 80 నుంచి వంద లారీల వరకు నిల్వలు ఉన్నాయి. ఇక ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో నాణ్యత తగ్గిందని ధరలు తగ్గిస్తున్నారు. ఆగలేకపోతే హైదరాబాద్ వెళ్లి అమ్ముకోవాలని రైతులకు సూచించారు అధికారులు. ఒకపక్క కర్నూలు మార్కెట్ కు ఇంత మొత్తంలో ఉల్లి వస్తుంటే దీనిని పట్టించుకోని ప్రభుత్వం… ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.