ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కలిసి నడవాలని జనసేన, టీడీపీ ఓ అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి ముందుకెళ్లాలని జనసేన పార్టీ కార్యకర్తలకు సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని ఉద్బోధించారు. సీఎం స్థానం పట్ల తాను ఏరోజు విముఖత చూపలేదని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం స్థానం పట్ల తాను సుముఖతతోనే ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజల భవిష్యత్ కోసమే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్నారు. టీడీపీతో పొత్తుకు పార్టీలోని అంతా సమర్థించినట్లు తెలిపారు. అలాగే టీడీపీతో కలిసి పనిచేసే అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
క్రియాశీలక సభ్యుల అభిప్రాయాలను నివేదక రూపంలో తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్ధుకుని ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మనం బలమైన దిశానిర్దేశం చేసేలా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. జనసేన 150మందితో ప్రారంభమై నేడు 6.5లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఒకరి అండదండలతో కాకుండా సొంతంగా బలోపేతం అయినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి ఎన్నికలు వెళ్తున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా టీడీపీ-జనసేన పార్టీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.