ప్రకాశం జిల్లాలో భూ కబ్జాల వ్యవహారం సీఐడీకి ఏపీ ప్రభుత్వం రిఫర్ చేయనుంది అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గన్ మ్యాన్ లను సరెండర్ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.. వారు డ్యూటీలో చేరారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.
తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభను ఎప్పుడూ అనుభవించలేదని.. ఎమ్మెల్యేకి తెలియకుండానే భూకబ్జా జరుగుతుందా? అని ప్రజలు అనుమానిస్తున్నారని ధనుంజయ్ రెడ్డికి బాలినేని చెప్పారు. భూకబ్జా దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోమని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిస్పాక్షికంగా వ్యవహరించాలని కలెక్టర్ , ఎస్‌పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలులో భూకబ్జా పూర్వపరాలను ధనుంజయ్ రెడ్డికి బాలినేని వివరించారు. మరోవైపు.. నకిలీ డాక్యుమెంట్ల దర్యాప్తును నిష్పక్షపాతంగా చేపట్టాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు బాలినేని సూచించారు. అంతేకాదు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లోతుగా దర్యాప్తు చేయాలని ఎస్పీ అధికారులను.. ఉన్నతాధికారులు ఆదేశించారు.