ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అసెంబ్లీ బిల్లుకు గెజిట్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఇక, ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేశన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతూ.. తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 99 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, డీఎంఈ కార్యాలయ అవసరాలకు మంజూరై.. భర్తీ కాకుండా వివిధ కేటగిరిల్లో ఉన్న పోస్టులను రద్దు చేస్తూ, వాటి స్థానంలో కొత్త పోస్టులను సృష్టించింది. ప్రతి ఆసుపత్రికీ ఒక్కోటి చొప్పున ఎడ్మినిస్ట్రేటర్ పోస్టును ప్రభుత్వం కేటాయించింది.
కొత్తగా మంజూరుచేసిన ఈ పోస్టును స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (జాయింట్ డైరెక్టర్ అడ్మిన్), కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఫెసిల్టీ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో డీఎంఈ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ పోస్టులు -02, నోడల్ ఆఫీసర్-08, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-01, డేటా ఎనలిస్టు-02, ఎంఐఎస్ మేనేజర్-01, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులు-08 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అడిషనల్ డైరెక్టర్ పోస్టులను రెగ్యులర్, ఇతర పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.